Wednesday, May 30, 2012

Nallamothu Sridhar



  1. ఏదో సాధించాలన్న తపన మనసు లోతుల్లో జ్వలించకపోతే దేహం నిర్జీవమైపోతుంది. కాంక్ష మనసుకూ, శరీరానికీ జీవశక్తినిస్తుంది. కాంక్షే ఆవిరైపోతే అన్ని శక్తులు హరించుకుపోతాయి.
  2. మనలోని శక్తికేంద్రం నుండి ఉద్భవించే శక్తిని ఏ పనులకై వినియొగిసున్నామన్న దాన్నిబట్టే ఈ క్షణం మనం ఉన్నాం. 
  3. మనలో ఏదైనా శూన్యత,అసంతృప్తి ఏర్పడితే దాన్ని వెంటనే గుర్తించి వీలైనంత త్వరగా చక్కని లక్ష్యాన్ని నిర్దేశించకపోతే మానసికంగా వ్యాకులత ఆవరిస్తుంది.
  4. ఏదో ఒక లక్ష్యం నిరంతరం మనల్ని నడిపిస్తూనే ఉంటుంది. లక్ష్యం నిర్దేశించకపోవడం తెలియకపోతే లోపల ఉండే అగ్ని..కోరికలుగా పరివర్తన చెందుతుంది.  
  5. వాదనల్లో ఓడిపొయినంత మాత్రాన సత్యాలు అసత్యాలైపోవు.
  6. బుద్ధిచేసే తార్కిక విశ్లేషణల జల్లెడకు దొరకని అంశాలెన్నో మనసుని తాకుతునే ఉంటాయి.
  7. మితిమీరిన తర్కం అహాన్ని పెంచుతుంది.
  8. దేన్నయినా మూర్ఖంగా వాదించే తత్వం వదిలేయాలి. లేదంటే అందరూ మనల్ని అంగీకరిస్తున్నట్లు భ్రమింపజేస్తునే మనల్ని తమ పరిధి నుండి బహిష్కరిస్తుంటారు.
  9. మన లక్ష్యాలు ఉన్నతమైనవి. కానీ వాటిని సాధించడానికి అనుసరించే మార్గాలోనే లోపమంతా.
  10. ఎంత గొప్ప లక్ష్యమైనా నిజాయితీ,స్వచ్చత లేకుండా సాకారమైతే అపరాధభావానికి గురిచేస్తుంది.
  11. మనం సరిగ్గా ఎదగలేకపోతున్నామంటే అది మన తప్పు తప్ప ఎదుట వ్యక్తి మనపై ఏదో కుట్ర చేస్తున్నారని ద్వేషం పెంచుకోవడం అర్ధరహితం. 
  12. లక్ష్య సాధన అనేది ఎలాగైనా పూర్తిచేయొచ్చు..కాని వినమ్రంతో కూడిన విజయం, ఎవరిని గాయపరచకుండా, నొప్పించ కుండా సాకారమైన లక్ష్యం మన జీవితానికి అర్ధాన్నిస్తుంది.  
(కంప్యూటర్ ఎరా సౌజన్యంతో,శ్రీధర్  గారి అంగీకారంతో వారి సంపాదకీయాల నుండి సేకరించినవి)






1 comment: